6 February 2017

3. G H G P ( తెలుగు )


           ఎపిసోడ్ - 3 

   ''కేఫ్  లవ్ బర్డ్స్'' 

 

( గమనిక : కథతో సంబంధం లేకుండా మధ్యలో వచ్చేసి అర్ధం పర్ధం లేని సందేహలు అడిగేవాడు శీను, వాటిని ఓపికగా ( ? ) నివృత్తి చేసేవాడు చందు  - రచయిత )

ప్పుడే నిద్ర లేస్తున్న హైదరాబాద్.
నిద్రలేవటం ఏంటి ? అసలు హైదరాబాద్ పడుకుంటేనే కదా.
నైట్ షిఫ్ట్ ముగించుకొని వచ్చే సాఫ్ట్ వేర్  కూలీలు, అప్పుడే పనికి బయలుదేరిన రోజువారీ కూలీలు. ఎంతో మంది బ్యాగ్ లు  ( బాధ్యతలు )  మోసుకొచ్చే బస్సులు, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వారిని మోసే సిటీ బస్సులు.

రద్దీగా  ఉండే రోడ్లు, 
బలంగా ఉండే బుద్దుడు. 
కాలుష్యం తో నిండిన వాతావరణం,
కల్మషం లేని మనుషులు.

ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న ఏ ఒక్కరం ఇంకొకడికి  అడ్రెస్ సరిగ్గా చెప్పలేం, బస్ మీద పేరు చూసి కూడా ''అన్నా ఈ బస్ కోఠి పోతుందా ?'' అని అడుగుతాం. సినిమా టిక్కెట్ల కోసం ఎంతసేపైనా క్యూ లో నిల్చుంటాం, సిగ్నల్ దగ్గర మాత్రం ఐదు నిమిషాలు ఆగలేము. పరిష్కారం లేని ఎన్నో సమస్యల్ని ఛాయ్ - బిస్కెట్ తో డిస్కస్ చేస్తూ ఉంటాం. 

అయినా ఇప్పుడెందుకు హైదరాబాద్ గురించి ఈ ఉపోద్ఘాతం ?

"కథ హైదరాబాద్ లో జరుగుతుంది అని ఆడియన్స్.కి ఇంజెక్ట్ చేయటం అన్నట్టు. దీన్నే 'డైరెక్టోరియల్ బ్రిలియన్స్' అని అంటారు''.

                                    *  *  *  *  *  *

ప్రపంచంలో చాలా వాటికి, అంటే ప్రతిదానికి కూడా ఓ పేరుంటుంది. తినే వస్తువు దగ్గర నుంచి తినకూడని వాటి దాకా. ఉండే ప్రదేశం నుంచి వెళ్ళే విదేశం దాకా, బడికి గుడికి  ఇలా ప్రతిదానికి ఓ పేరు ఉంటది. పేర్లు లేనప్పుడు లేదా పెట్టనప్పుడు పిలవటానికి వీలుగా అక్కడ గుర్తునో, వృత్తినో పరిగణలోకి  తీసుకుంటారు. బండ గుర్తు ఏది లేని ఆ వీధికి ''కేఫ్ లవ్ బర్డ్స్'' గుర్తింపు అయింది. పోస్ట్ కార్డులో చిరునామా  రాయటం తేలికయింది. మన కథలో బాగా కీలకమైంది, ప్రతి పాత్రకి బాగా పరిచయం ఉన్నది.

మత్తుగా నిద్రపోయే హైదరాబాద్ ని నిద్రలేపేది...

"అదేంటి ఇందాక హైదరాబాద్ అసలు నిద్రపోదు అన్నావు ??''

కొన్నిసార్లు  శబ్దం చేసి నిశ్శబ్దం కూడా సృష్టించొచ్చు. ప్రత్యేకమైన వాయిద్యాలు ఏం అవసరం లేదు. విసరటానికి చెయ్యి తగలటానికి చంప ఉంటె చాలు.

కేఫ్ విషయానికి వస్తే ''కేఫ్ లవ్ బర్డ్స్'' అని నేమ్ బోర్డు తెలుగు, హిందీ, ఉర్దూ లో రాసి ఉంటుంది. త్రివేణి సంగమం లాగా, త్రివర్ణ పతాకం లాగా. కుడి వైపుకి కొంచెం పైన  ప్రో॥ కరీమ్. 
కేఫ్ ఈ ప్రదేశంలో పాతుకుపోయినట్టు సంకేతాన్నిచే స్థిరమైన స్థంబాలు, సేద తీర్చటానికి ఆహ్వానిస్తున్నట్టుండే  బల్లలు కుర్చీలు, సరసాలు ఆడుకునే కప్పులు సాసర్లు, ఇరానీ ఛాయ్ సువ్వాసన. అన్నిటికంటే ముఖ్యమైంది ఎప్పుడు నవ్వుతూ పలకరించే కరీమ్ చాచా. వీధిలో ఉన్న కుర్రవాళ్ళందరికి కాలక్షేపం ఆ కేఫ్, పిచ్చా పాటి మాట్లాడుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపార లావాదేవీలు చర్చించుకునేవాళ్ళు, పనులతో అలసిపోయి వచ్చిన వాళ్ళు, అసలేమీ పని లేకుండా అందులోనే కూర్చునే వాళ్ళు, శేఖరంలా  సినిమా కథలు రాసుకునే వాళ్ళు.

కరీమ్ - ఆయన ఆప్తులు అంత భాయ్ అని తక్కిన వాళ్లంతా చాచా అని పిలుస్తారు. అంత ఎత్తు ఏమి కాదు. గుండ్రటి మొహం, తెల్లటి గడ్డం, మొహం మీదే అనుభవాన్ని సూచించే ముడతలు.
పాల లాంటి తెల్లటి  మనసు ఉన్నప్పుడు డికాషన్ రంగు ఏం పట్టింపు లోకి వస్తుంది ? ఎప్పుడు ఖుర్తాలోనే ఉండేవాడు. చెదరని జుట్టు, చెరగని చిరునవ్వు. అతనికి తెలిసింది రెండే రెండు.  ఒకటి కౌంటర్ లో కూర్చోవటం, రెండు నమాజ్.

కరీమ్ ఉదయం ఐదున్నరకే  కేఫ్ తెరిచేవాడు, కాలం తో సంబంధం లేకుండా. కరీమ్ ఛాయ్ లో ఏదో మత్తు ఉంది అంటారు దానికి అలవాటు పడ్డవాళ్ళు. దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు ఆయన మనస్సు లాగే చాయ్ లో వాడే పాలు కూడా స్వచ్చమైనవి అని ఒకళ్ళు, ఎంత చిరాకు నుంచి అయినా తెరిపి ఇచ్చే కాఫీ రుచి లాంటి చిరునవ్వు అని ఇంకొకళ్ళు అంటారు.  ఏంట్రా వీడు కరీమ్ కేఫ్ కి యాడ్ కట్ చేస్తున్నాడా అని అనుకోవచ్చు నేను చెప్పే దాంట్లో అతిశయోక్తి ఏమి లేదు. కావాలంటే ఒక్క ఛాయ్ తాగి చూడండి కరీమ్ కేఫ్ లో.

ఇంత పేరున్న కేఫ్ కి ఓనర్ ఎలా అయ్యాడంటే దానికో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. వీళ్ళ పూర్వీకులు పాకిస్థాన్ భారతదేశం నుంచి విడిపోకముందు సరిహద్దు ప్రాంతంలో వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. విడిపోయిన తరువాత  వలస కింద క్రిందకి వచ్చారు.  భూభాగం, ఆస్తి విభాగం రెండిట్లోనూ. వీళ్ళ నాన్న గారు ఒక చిన్న టీ స్టాల్ తో మొదలుపెట్టారు. అలా వీళ్ళ ప్రస్థానం ఇప్పుడు  ''కేఫ్ లవ్ బర్డ్స్'' దాకా వచ్చింది. కేఫ్ ని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో వీళ్ళ నాన్న కూడా పైకి...... కరీమ్ కి ఒక కొడుకు ఉన్నాడు పేరు ఇస్మాయిల్. తల్లి లేని పిల్లోడు అని చేసిన గారం, కరీమ్ చాచాకి చాలా తలనొప్పిగా తయాయింది.

ఎవరికి తెలుసు జరగబోయే దొంగతనాల స్కెచ్ గీయటానికి వొత్తు ఆ బల్లలే అవుతాయి అని. సాక్షులు ఆ కేఫ్ లో కప్పులు అవుతాయి అని.               *   *    *   *    *   *


ఎర్రగా భగ భగ మండి అలసిపోయి కాషాయం స్వీకరించి కిందకి జారిపోతున్నాడు సూర్యుడు. అందులోనూ శీతాకాలం అయ్యే సరికి చలికి భయపడి చీకటి అనే చద్దరు కప్పుకోటానికి  సిద్దమయ్యాడు. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తున్న కొత్త పెళ్లి కూతురిలా కదలాల వద్దా అన్నట్టు కదులుతుంది బస్.  సీటు దొరికిన వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు  దొరకని వాళ్ళు  అసహనంగా ట్రాఫిక్ ని, ఈ  సిటీని, అసలు ఈ ప్రయాణాన్నే తిట్టుకుంటున్నారు.

చిరాకుగా వాచ్ చూసుకున్నాడు పార్ధు. సమయం ఐదున్నర కావస్తుంది. అప్పటికే అరగంట ఆలస్యం అయ్యింది. కలవాల్సిన టైం దాటిపోయింది, ఇంకా దాటాల్సిన స్టాప్.లు రెండు ఉన్నాయ్. చేయగలిగింది ఏమి లేక ఇంకోసారి వాచ్ చూసుకున్నాడు.

                      *  *  *

చాలా అరుదుగా లభించే అవకాశాన్నివదులుకోదలుచుకోకుండా ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో నడవలేక నడుస్తున్నారు యువకులు, చల్లగాలి కోసం వచ్చిన వృద్దులు. వీళ్ళందరితో పాటు పార్క్ కి పరిపూర్ణత తీసుకొచ్చే ప్రేమికులు. ప్రేమలో ఉన్నప్పుడు ఎదురు చూడటం చాలా బావుంటుంది అంటారు, కానీ ఇక్కడ సుభాషిణి పరిస్థితి అందుకు భిన్నంగా  ఉంది. సాధారణంగా అమ్మాయిలు, చెప్పిన సమయానికి రాకపోయినా వాళ్ళ దగ్గర వాదించటానికి విషయం ఉంటుంది. ఒకవేళ పొరపాటున అర్ధ గంట ముందు వస్తే ? విడిపోవటానికి అంతకంటే పెద్ద కారణం కూడా అవసరం లేదు చాలామందికి. ఆ సమయంలో  'సమయ పాలనా' అనే పుస్తకాన్ని కూడా రాసి వినిపిస్తారు. అసహనంగా గేటు వంక చూస్తూనే ఉంది సుభాషిణి.

     *  *  *  *

పార్ధు గేట్ లో నుంచి రావటం దూరం నుంచే గమనించింది సుభాషిణి. ఒక నిర్ణయానికి వచ్చినట్టు గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ప్రేమించినవాళ్ళ దగ్గర కఠినంగా ప్రవర్తించవల్సి వస్తే అది ఎంత కష్టమో ఆమెకి స్పష్టంగా తెలుస్తుంది. 

పార్ధు వచ్చాడు. ఎప్పటిలానే చేతి వేళ్ళు కౌగిలించుకున్నాయి, కళ్ళు కుశల ప్రశ్నలు వేసుకున్నాయి. అబ్బాయి కాబట్టి కొంచెం ఆలస్యంగా పసిగట్టాడు పార్ధు. ఏమైంది అని అడిగాడు. 

పార్ధు కళ్ళలోకి చూసి చెప్పలేదని ఆమెకి అర్ధం అయిపోయింది. కానీ చెప్పాలి. చెప్పేసింది.

" అయినా భలే ఇబ్బందుల్లో పడేస్తారు పార్ధు మా అమ్మాయిల్ని. ఇంట్లోవాళ్ళు కావాలి అంటే విడిపోవటానికి వంకా, నమ్మించి మోసం చేసింది రా అంటారు. ప్రేమ వైపు మొగ్గు చూపితే కన్న ప్రేమ మీద విశ్వాసం లేదంటారు.

ఆనందంగా ఉండటానికి డబ్బు, ఉద్యోగం పరిమాణాలు కాకపోవచ్చు.  కానీ, పెళ్లి కి ఇవి కచ్చితంగా కొలమానాలు అవుతాయి. నీ సిద్ధాంతాల్ని కాదనలేను , మా ఇంట్లో వాళ్ళ రాద్ధాంతాన్ని తప్పు పట్టలేను.  మనల్ని మనం మార్చుకోటం కంటే మర్చిపోవటం సులభం పార్ధు.'' తను  ఏమంటాడో అని కూడా వినకుండా తన దారిలో తను వెళ్లిపోయింది సుభాషిణి .

ఏం మాట్లాడాలో పార్ధుకి అర్ధం కాలేదు. అభిప్రాయాన్ని చెప్పినప్పుడు వాదించొచ్చు, బుజ్జగించొచ్చు, నిర్ణయాన్ని చెప్పినప్పుడు కాదు. పార్ధు అరవలేదు, గట్టిగా అడగనూ లేదు. అయినా అర్ధం చేసుకోవటమే  కదా ప్రేమంటే.


                                        సశేషం 

                          రచన 

గౌతమ్ మల్లాది.


[ ఎపిసోడ్ 4 - ఎలాగో చెప్పిన డేట్ కి రావట్లేదు వీలుంటే వాలంటైన్స్ డే  6PM నుంచి. ఎప్పటిలానే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని / సూచనల్ని  క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.] 

No comments:

Post a Comment